Translated to Telugu by Abhinav
Note: Read the Original English Version Here
తెలుగు చదువటన్న తేలికగ జూచుట — ఆంగ్ల పాఠశాలలందు గలదు.
~ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి
ఒక చిన్న పద్యం కొన్నిసార్లు అవమానపు సుదీర్ఘ చరిత్రనంతటినీ తనలో ఇముడ్చుకోగలదు. ఈ రెండు పంక్తుల్లో ఎటువంటి నినాదమూ లేదు, ప్రణాళికా ప్రకటనా లేదు, జనసమూహం ముందు చేసే ఆవేశపూరిత ప్రసంగమూ లేదు. ఇందులో ఉన్నదల్లా వ్యంగ్యంగా సాన పట్టిన ఒక ఉపాధ్యాయుని పాత వేదన మాత్రమే. ఇక్కడ ఆంగ్ల పాఠశాలల్లో తెలుగుపై బహిరంగ దాడి జరగడం లేదు. దానిని నిషేధించడమూ లేదు. వలసపాలనలోని ఇతర ప్రాంతాల్లో జరిగినట్లుగా, కర్రతో కొట్టి పిల్లల నుండి దాన్ని వెళ్లగొట్టడమూ లేదు. కేవలం దాన్ని చులకన చేస్తున్నారు. దాన్ని ఒక ఇంటి భాషగా, ఒక భావోద్వేగాల భాషగా, తాతయ్య–అమ్మమ్మల భాషగా, వంటగది–ఆచారాలు–జోలపాటలు–జాతీయాలు–సామెతలు–మందలింపులు–పల్లెటూరి జ్ఞాపకాల భాషగా మార్చేస్తున్నారు. ఆప్యాయతకు ఇది ఉపయోగకరమే కావచ్చు. కానీ ఆలోచనకు మాత్రం పనికిరానిదిగా పరిగణించబడుతోంది.
ఆంగ్ల పాఠశాలకు తెలుగును ఎప్పుడూ నేరుగా అవమానించాల్సిన అవసరమే రాలేదు. అది కేవలం గౌరవ స్థానాలను మార్చివేస్తే చాలు. ఆంగ్లాన్ని ఆశయాల భాషగా, తెలుగును మిగిలిపోయిన అవశేషం వంటి భాషగా అది మార్చింది. పరీక్షలు, ఉద్యోగం, చట్టం, అధికార యంత్రాంగం, సైన్స్ (విజ్ఞానశాస్త్రం), హోదా, "ఆధునికులు"గా అనిపించుకునే ఆ మర్యాదపూర్వక హింస — వీటన్నిటికీ ఆంగ్లం మార్గంగా మారింది. పగటి ముఖ్యమైన పనులు ముగిసిన తర్వాత తిరిగి చేరుకునే భాషగా తెలుగు మిగిలిపోయింది. అది ఆత్మీయమైనది అయింది కానీ ప్రామాణికమైనది కాలేదు. దగ్గరైనది కానీ ఉన్నతమైనది కాదు. ప్రేమించబడేది కానీ అనుసరించబడనిది.
ఈ చీలిక లోపలి నుండే విశ్వనాథ సత్యనారాయణను చదవాలి.
ఆయన కేవలం ఒక గొప్ప తెలుగు రచయిత మాత్రమే కారు. ఆ నిర్వచనం ఆయనకు చాలా చిన్నది — ఆ చిన్నతనమే అపారమైనది అయినప్పటికీ. ఆయన ఒక నాగరికతా-అంతరాయం. విద్యావంతులైన భారతీయ మనసు నన్నయ, తిక్కన, శ్రీనాథ, కాళిదాస, అభినవగుప్త, మమ్మట, ఆనందవర్ధనులను ఉటంకించగలిగిన దానికంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో షెల్లీ, కీట్స్, ఆర్నాల్డ్, అలియెట్‌లను — ఆ తర్వాత మార్క్స్, ఫ్రాయిడ్, రస్సెల్‌లను — ఉటంకించడం నేర్చుకుంటున్న తరుణంలో ఆయన వచ్చారు. నూతన మేధావి వర్గం ఒక విచిత్రమైన అలవాటును అలవర్చుకోవడం మొదలుపెట్టింది. అది పాత గ్రంథాలను ఎల్లప్పుడూ తిరస్కరించలేదు. అది మరింత సూక్ష్మమైన పని చేసింది — ఆంగ్లం అనుమతితో వాటిని ఉటంకించింది. ఒక సంస్కృత లేదా తెలుగు గ్రంథం, ఒక ప్రాచ్యవాద అనువాదం ద్వారా గానీ, విశ్వవిద్యాలయం ఆమోదించిన కోణం ద్వారా గానీ పరిశీలిస్తె, అది సురక్షితమైపోయేది. దాన్ని సాహిత్యంగా, కల్పిత గాథగా, పత్రాగారంగా, జానపదంగా, లేదా "వారసత్వం"గా మెచ్చుకోవచ్చు. కానీ అది ఇకపై సిద్ధాంతంగా వర్తమానాన్ని శాసించలేకపోయింది.
సత్యనారాయణ గారు ఈ ఏర్పాటులో భాగం కావడానికి నిరాకరించారు.
—
ఆయన సమకాలీనులు ఆధునిక ఐరోపా కొలమానంతో సాహిత్యాన్ని కొలవడం నేర్చుకుంటున్నప్పుడు, ఆయన రసం, ఔచిత్యం, వక్రోక్తి, ధ్వని, అలంకారం, ఛందస్సు, పౌరాణిక స్మృతి, ఇతిహాస కల్పన, కావ్యంలోని క్రమశిక్షితమైన స్వేచ్ఛల గురించి మాట్లాడారు. ఆయన దీన్ని పాత విగ్రహాలకు దుమ్ము దులిపే సంగ్రహాలయం సంరక్షకుడిలా చేయలేదు. ఒక క్రియాశీల కళాకారుడిలా చేశారు. ఆయన దృష్టిలో ఆ పాత భావనలు సంస్కృత కావ్యశాస్త్రంలోని నిర్జీవ పదాలు కావు. అవి అవగాహనకు సాధనాలు. రసం ఏదో పురాతన భావన కాదు. భావోద్వేగం ఎలా సౌందర్యానుభూతిగా మారుతుందో అర్థం చేసుకునే ఒక మార్గం అది. ధ్వని పాండిత్య అలంకారం కాదు. అది సూచన, నిశ్శబ్దం, అనునాదం, మరియు భాష తన స్పష్టమైన అర్థాన్ని మించి మోసుకెళ్లే అదనపు భావానికి సంబంధించిన ఒక సిద్ధాంతం. వక్రోక్తి అంటే కేవలం "వంకర మాట" కాదు. కవిత్వం సూటి వాక్యాల నుండి తప్పించుకునే పరోక్ష శక్తి అది. ఔచిత్యం అనేది ఒక సామాజిక మర్యాద కాదు. భావవ్యక్తీకరణ, పాత్ర, సందర్భం, స్వరం, నైతిక లయ — వీటి అంతర్గత యోగ్యత అది.
వేరొక సాహిత్య సమాజంలో అయితే, అటువంటి మేధావిని సంప్రదాయం లోపలి నుండే ఆధునికతను ప్రతిపాదించిన సిద్ధాంతకర్తగా కీర్తించేవారు. ఆయన కాలంలో మాత్రం, ఆయనను తరచూ పాతకాలపువాడిగా చిత్రీకరించారు.
భారతీయ భాషల్లో వలసవాద ఆధునికత చూపిన క్రూరత్వం ఇది. అది కేవలం కొత్త సంస్థలను సృష్టించడమే కాదు — ఒక కొత్త సిగ్గును కూడా సృష్టించింది. ఒకప్పుడు గ్రంథ ప్రామాణికతకు, జ్ఞాపకశక్తికి, వ్యాకరణానికి, అభిరుచికి, బోధనాశాస్త్రానికి ప్రతీకగా నిలిచిన తెలుగు పండితుడు, ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నాటికి, ఆంగ్లవిద్యనభ్యసించిన మధ్యతరగతి దృష్టిలో ఒక కాస్త హాస్యాస్పదమైన వ్యక్తిగా మారిపోయాడు. అవును, అతని దగ్గర పాత పుస్తకాలు ఉండేవి. అతనికి ఛందస్సులు, వ్యుత్పత్తి శాస్త్రాలు, వంశావళులు, పురాణాలు తెలిసేవి. కానీ అతను రాజకీయ అర్థశాస్త్రం గురించి మాట్లాడగలడా? ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని చర్చించగలడా? తాళపత్ర గ్రంథాల, చందనపు వాసన లేకుండా విశ్వవిద్యాలయ ద్వారాల గుండా ప్రవేశించగలడా? ఆ పండితుడు ఒక శిలాజంగా తిరిగి మలచబడ్డాడు. అతని దగ్గర జ్ఞాపకశక్తి ఉంది కానీ తెలివితేటలు లేవు; భాష ఉంది కానీ జ్ఞానం లేదు; వారసత్వం ఉంది కానీ ఆలోచన లేదు.
ఈ విరోధాభాస చాలా తీక్ష్ణమైనది. తెలుగు అధికారం పతనమవుతున్న కొద్దీ తెలుగు గర్వం పెరిగింది. తెలుగు మధ్యతరగతి తన భాష గొప్పతనాన్ని కీర్తించగలిగింది, గుర్తింపును కోరగలిగింది, తమిళ ఆధిపత్యం నుండి తనను తాను వేరు చేసుకోగలిగింది, కవులను కొనియాడగలిగింది, భాషా గుర్తింపు చుట్టూ సంఘటితంకాగలిగింది. అయినప్పటికీ, తన సొంత విద్యా జీవితంలో మాత్రం, తెలుగులో ఆలోచించే అధికారాన్ని అది అంతకంతకూ వదులుకుంది. తెలుగు ఒక పతాకంగా మారింది, ఒక పద్ధతిగా కాదు. అది అన్వేషణగా కాకుండా గుర్తింపుగా మారింది. అది జనసమూహాలను సమీకరించగలిగింది కానీ తరగతి గదులను ఎల్లప్పుడూ శాసించలేకపోయింది.
సత్యనారాయణ గారు ఈ నిశ్శబ్ద స్థాయి తగ్గింపును ఎదిరించారు.
ఆయన ఒక సాధారణ పునరుద్ధరణవాది కాదు. అది సోమరితనపు వ్యాఖ్యానం. తెలుగు సాహిత్యాన్ని ఏదో మూసివేసిన ఆధునిక-ప్రాచీన గదిలోకి తిరిగి తీసుకెళ్లాలని ఆయన కోరుకోలేదు. ఆయన స్వంత రచనలే దీనికి విరుద్ధంగా నిలుస్తాయి. ఆయన నవలలు, నాటకాలు, కథలు, వ్యాసాలు, చారిత్రక కల్పన, విమర్శ, పౌరాణిక పునఃకథనాలు, తాత్విక చింతనలు రాశారు. ఆధునిక ముద్రణ సంస్కృతి రూపొందించిన ప్రక్రియల మధ్య ఆయన స్వేచ్ఛగా సంచరించారు. విశాలమైన సామాజిక ఊహాశక్తితో నిండిన వేయిపడగలు చరిత్ర నుండి దాక్కునే ఒక మనిషి రచన కాదు. రామాయణ కల్పవృక్షము కేవలం వాల్మీకిని సంప్రదాయ ఛందస్సులో తిరిగి చెప్పడం కాదు. ఒక ఇతిహాసం తెలుగు నేలపై అడుగుపెట్టి, తెలుగు సంవేదన ద్వారా శ్వాసించడం అంటే ఏమిటో చెప్పే ఒక వాదన అది.
అందుకే ఆయన విషయంలో "తెలుగుదనం" అనే మాట ముఖ్యమైనది. ఒక పాత్ర నుండి మరో పాత్రలోకి నీటిని ఒంపినట్టు సత్యనారాయణ రామాయణాన్ని తెలుగులోకి అనువదించలేదు. ఆయన దాన్ని ఈ నేలకు సహజం చేశారు. దానికి ఆహారాన్ని, వాతావరణాన్ని, జాతీయాన్ని, హావభావాన్ని, దేహ స్పర్శను, సామాజిక పరిసరాన్ని, స్థానిక జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆయన చేతుల్లో కేవలం రాముడి తెలుగుభాషకు మారలేదు — తెలుగు భాష ఆయనను తనలోకి స్వీకరిస్తుంది. ఇతిహాసం ఒక ప్రాంతానికి కుదించబడదు. పైగా, ఆ ప్రాంతమే ఇతిహాసపు సార్వత్రికతలోకి ఒక ద్వారం అవుతుంది. ఇది గొప్ప భారతీయ రహస్యాల్లో ఒకటి: సార్వత్రికమైనది స్థానికమైనదాన్ని తుడిచిపెట్టి రావాల్సిన అవసరం లేదు. స్థానికం ద్వారానే అది రాగలదు.
అందుకే రామాయణ కల్పవృక్షము చాలామందిని కలవరపెట్టింది. సత్యనారాయణ దాన్ని రాస్తున్న నాటికే, చాలామంది సాహిత్య పురోగతికి సంబంధించిన ఒక కొత్త సిద్ధాంతాన్ని అంగీకరించేశారు. కవిత్వం ఛందస్సు నుండి కొంచెం దూరమవ్వాలి ( విడివడాలి). పురాణం వాస్తవికతకు దారి ఇవ్వాలి. పాత రూపాలను అధిగమించాలి. భవిష్యత్తు వచనానిది, సామాజిక విమర్శది, వచన కవితది, మానసిక అంతరంగికతది, విప్లవాత్మక తక్షణతది, ఇరవయ్యవ శతాబ్దపు గుర్తుపట్టగల దుస్తుల్లో సమకాలీనంగా కనిపించే సాహిత్యానిది. అటువంటి కాలంలో, ఒక కవి ఏళ్ల తరబడి ఆరు సంపుటాల రామాయణాన్ని శాస్త్రీయ శైలిలో రచించడం దాదాపు ఒక రెచ్చగొట్టే చర్యే. ఆయన ఒక ఆధునిక సదస్సు గదిలోకి — వ్యామోహంతో కాక, ఒక ఆయుధంతో — అడుగుపెట్టినట్టే ఉంది.
ఆయన విమర్శకులు ఒక స్పష్టమైన ప్రశ్న వేశారు: ఇప్పుడెందుకు? ఆయన ఇచ్చిన సమాధానం సూచనగా ఉన్నప్పటికీ తరచూ బాహాటంగా మరింత దారుణమైనది: ఇప్పుడెందుకు కాకూడదు? ఇతిహాసం ఆధునికం కాజాలదని ఎవరు నిర్ణయించారు? ఛందస్సు ఒక చెరసాల అని ఎవరు నిర్ణయించారు? వారసత్వంగా వచ్చిన రూపాలు దిగుమతి చేసుకున్నవాటి కంటే మేధాపరంగా తక్కువని ఎవరు నిర్ణయించారు? అలియెట్‌ను ఉల్లెఖించగలగడం ఆధునికం, కానీ అభినవగుప్తుని ద్వారా ఆలోచించగలగడం ఆధునికం కాదని ఎవరు నిర్ణయించారు? ఆంగ్లవిద్య సాహిత్య స్మృతిలోపాన్ని కాక సాహిత్య స్వేచ్ఛను సృష్టించిందని ఎవరు నిర్ణయించారు?
సత్యనారాయణ గారి లోతైన పోరు ఆంగ్ల సాహిత్యంతో కాదు. అలా సంకుచితంగా ఉండటానికి ఆయన మరీ పండితుడు. ఆయన పోరు పురోగతి ముసుగు వేసుకున్న అనుకరణతో. తన సొంత వారసత్వాన్ని గుర్తించడానికి విదేశీ ఆమోదంపై ఆధారపడిపోయిన విద్యావంతుడైన భారతీయ మనసును ఆయన ఖండించారు. ఆంగ్లవిద్య కేవలం ఒక భాషను జోడించలేదని ఆయన గ్రహించారు — అది ఆత్మవిశ్వాసపు క్రమాన్నే మార్చివేసింది. అది భారతీయ మేధావిని తన అమ్మమ్మ సామెతల పట్ల, తన ప్రాంతపు ఛందస్సుల పట్ల, తనకు వారసత్వంగా వచ్చిన తత్త్వశాస్త్రం పట్ల, తన మౌఖిక–లిఖిత ప్రపంచాల పట్ల అనుమానంగా చూసేలా చేసింది. వాటిని విశ్లేషణకు మూలాధారాలుగా కాక, ఆధునిక విశ్లేషణకు ముడిసరుకుగా చూడమని అది నేర్పింది.
ఆయన దృష్టిలో, సంప్రదాయాన్ని ఒక వస్తువుగా అధ్యయనం చేయడం ఒక విషయం. దాని గురించి ఆలోచించడం పూర్తిగా వేరొక విషయం. మొదటిది సాంస్కృతిక వ్యాఖ్యానాన్ని సృష్టిస్తుంది. రెండోది మేధాపరమైన సార్వభౌమత్వాన్ని సృష్టిస్తుంది. సత్యనారాయణ రెండోదాని కోసం పట్టుబట్టారు. తెలుగు ఒక గాజు పెట్టెలో భద్రపరచిన నిదర్శనంగా మిగిలిపోవాలని ఆయన కోరుకోలేదు. అది ఒక శాస్త్రాన్ని మోసే భాషగా; తీర్పు, తత్త్వశాస్త్రం, విమర్శ, సౌందర్యం, ప్రపంచ-నిర్మాణం చేయగల భాషగా, నిలవాలని ఆయన కోరుకున్నారు.
ఆ ఆకాంక్షే ఆయనను ఇబ్బందికరమైన వ్యక్తిని చేసింది. సత్యనారాయణ గురించి సంజయ్ సుబ్రహ్మణ్యం చేసిన చిరస్మరణీయమైన వర్ణన ఈ సమస్యను చక్కగా పట్టుకుంటుంది: కాలం చెల్లినవాడిగా కొట్టిపారేయడానికి సత్యనారాయణ మరీ ఆధునికుడు, ఆధునికతలోకి సౌకర్యంగా కలిసిపోవడానికి మరీ పాతకాలపువాడు. అర్ధ శతాబ్దం పాటు, ఆయన తెలుగు సాహిత్య జీవితంలో తప్పించుకోలేని ఒక ఉనికిలా సంచరించారు. ఆయనను ఇష్టపడకపోవచ్చు, ఎదిరించవచ్చు, ఎగతాళి చేయవచ్చు, కలహించవచ్చు, లేదా సంప్రదాయవాదం, బ్రాహ్మణవాదం, కఠినత్వం, అహంకారం, అతిశయం అని ఆరోపించవచ్చు. కానీ ఆయన ఒక చిన్న రచయిత అని అనుకోలేరు. ఆయన పాండిత్యం మరీ విశాలమైనది. ఆయన ఊహాశక్తి మరీ పర్వతప్రాయమైనది. తెలుగుపై ఆయన పట్టు మరీ సంపూర్ణమైనది. వలస విద్య నుండి సాహిత్య ఆధునికవాదంలోకి సాగే సులభమార్గాన్ని అడ్డుకుంటూ ఆయన అక్కడ నిలబడ్డారు.
ఆయన కలిగించిన అసౌకర్యంలో దాదాపు హాస్యాస్పదమైన అంశం ఒకటుంది. ప్రతి సాహిత్య యుగమూ తన తిరుగుబాటుదారులు పరిచితంగా కనిపించాలని కోరుకుంటుంది. అభ్యుదయ తిరుగుబాటుదారుని గుర్తించడం సులభం. అతను ఛందస్సును విరగ్గొడతాడు, ఆచారాలపై దాడి చేస్తాడు, దేవతలను ఎగతాళి చేస్తాడు, కార్మికుల గురించి,స్త్రీల గురించి,సామాజిక అన్యాయం గురించి రాస్తాడు, విముక్తి పదజాలంలో మాట్లాడతాడు. సత్యనారాయణ వేరే రకమైన తిరుగుబాటుదారు. ఆయన తిరుగుబాటుపైనే తిరుగుబాటు చేశారు. కొత్త స్వేచ్ఛ మరో దాస్యంగా మారిందా అని ఆయన ప్రశ్నించారు. సంప్రదాయాన్ని తిరస్కరించడం ఎల్లప్పుడూ ధైర్యమేనా, లేక కొన్నిసార్లు ఒక కొత్త గతికి (పోకడకు) లొంగిపోవడమేనా అని ఆయన ప్రశ్నించారు. ఆధునిక తెలుగు రచయిత ప్రపంచాన్ని సంపాదించి, తన సొంత లోతుల వ్యాకరణాన్ని కోల్పోయాడా అని ఆయన ప్రశ్నించారు.
దీని అర్థం సత్యనారాయణను సంపూర్ణంగా ఆమోదించాలని కాదు. ఏ గొప్ప రచయితనూ ఒక గుడిగా మార్చకూడదు. ఆయనతో వాదించాల్సిందే. ఆయన అంచెల వ్యవస్థలు, సామాజిక భావనలు, నాగరికతాపరమైన నిశ్చయాలు, వివాదాస్పద అతిశయాలు పరిశీలనకు అర్హమైనవి. సంప్రదాయం పట్ల ఆయన సమర్థన కొన్నిసార్లు కదలడానికి నిరాకరించే ఉరుములమేఘంలా అనిపించవచ్చు. ఆయన అధికారం పాఠకుడిపై బరువుగా మోపే క్షణాలు ఉన్నాయి. కానీ ఇది కూడా ఆయన ప్రాముఖ్యతలో భాగమే. ఆయన ఎవరో వినియోగించుకునే రచయిత కాదు; ఎవరికైనా ఎదురయ్యే రచయిత. ఆయన పాఠకుడి తెలివితేటలను పొగడడు; వాటిని పరీక్షిస్తాడు. మనం జీవిస్తున్న ఈ కాలంలో, ఈ పరీక్ష మరింత తక్షణమైనది, మరింత కీలకమైనది.
భారతీయ భాషలను నిరంతరం పొగుడుతూనే, నిర్మాణపరంగా బలహీనపరిచే ఒక యుగంలో మనం జీవిస్తున్నాం. ఉపన్యాసాల్లో మాతృభాషలను కీర్తిస్తూనే, మన పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేరుస్తాం. భాషా దినోత్సవం నాడు కవితలు పోస్ట్ చేసి, ఆ తర్వాత విద్యావిషయాలు,విధానం,న్యాయం,వైద్యం,సాంకేతికత గురించి తీవ్రమైన సమావేశాలను ఆంగ్లంలో నిర్వహిస్తాం. తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళం, మరాఠీ, మలయాళం, ఒడియా, అస్సామీ మొదలైన భాషలను "సంపన్నమైనవి" అంటాం — దాని అర్థం తరచూ, వాటి నుండి ఎలాంటి కఠిన శ్రమను మనం ఆశించమని. సంపన్నత ఓదార్పుగా మారుతుంది. భవిష్యత్తు ఆంగ్లానికి దక్కుతుంది. భారతీయ భాషలకు పూజ్యభావం దక్కుతుంది.
వేంకట శాస్త్రి పద్యం ముందే ఊహించిన ప్రపంచం సరిగ్గా ఇదే.
"ఆంగ్ల పాఠశాలల్లో వారు తెలుగును తేలికగా తీసుకుంటారు." ఈ పంక్తి నిన్ననే రాసినట్టుంది. ఆంగ్ల పాఠశాల ఇప్పుడు ఆంగ్ల-మాధ్యమ భావనగా మారిపోయింది. పాఠశాల భవనం వలస అధికారపు పరిధికి దూరంగా ఉన్నప్పటికీ అది ఉనికిలో ఉంది. మాతృభాష పట్ల ప్రేమ ఉద్యోగావకాశాలను తగ్గించవచ్చని భయపడే తల్లిదండ్రుల్లో అది ఉంది. ఆంగ్ల-భాషా విద్యావ్యవస్థ అనువదించి, ఉటంకించి, సూచీకరించి, ధ్రువీకరిస్తే తప్ప భారతీయ భాషా పరిశోధనను ద్వితీయ శ్రేణిగా చూసే విశ్వవిద్యాలయాల్లో అది ఉంది. మానసిక గాయాన్ని, అస్తిత్వాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని, పితృస్వామ్యాన్ని ఆంగ్లంలో వర్ణించగలిగిని యువ విద్యార్థికి తన కుటుంబం తరతరాలుగా జీవించిన భాషలో ఒక్క పేజీ ఆత్మపరిశీలనాత్మక వచనం రాయలేలేకపోతున్నాడు.
సత్యనారాయణ గారి ప్రాసంగికత ఇక్కడే ఉంది. ఒక భాష ప్రజలు దాన్ని మాట్లాడటం మానేసినప్పుడు చనిపోదు; సంక్లిష్టతను దానికి అప్పగించడంలో నమ్మకాన్ని కోల్పోయినప్పుడు చనిపోతుంది అని ఆయన మనకు గుర్తు చేస్తారు. ఒక భాష వేళాకోళంలో(జోకుల్లో), పాటల్లో, సినిమాలో, ఇంటి ఆప్యాయతలో, రాజకీయ నినాదాల్లో మనుగడ సాగిస్తూనే తన మేధాపరమైన సార్వభౌమత్వాన్ని కోల్పోవచ్చు. దానికి కోట్లాది మంది మాట్లాడేవారు ఉండవచ్చు, అయినా సదస్సు బల్ల ముందు బెదురుగా మారవచ్చు. దానికి ఇతిహాసాలు, వ్యాకరణాలు, తాత్విక పదజాలాలు, భక్తి సంప్రదాయాలు, ఆస్థాన కవిత్వం, జానపద రూపాలు, ఆధునిక కల్పన ఉండవచ్చు అయినా సిద్ధాంతానికి పనికిరానిదిగా పరిగణించబడవచ్చు.
అందుకే నేడు సత్యనారాయణను చదవడం అనేది ఒక పునరుద్ధరణ సాధన. భారతీయ భాషలు గతానికీ వర్తమానానికీ మధ్య ఎంచుకోవాల్సిన అవసరం లేదన్న సంభావ్యత వైపు ఆయన మనల్ని తిరిగి తీసుకెళతారు. అవి రెండింటినీ మోయగలవు. అవి పల్లెను–విశ్వవిద్యాలయాన్ని, పురాణాన్ని–నవలను, ఛందస్సును–ఆధునిక సంక్షోభాన్ని, స్థానిక సామెతని వైశ్విక (విశ్వజనీన) ప్రశ్నను కలిగి ఉండగలవు. అవి భావోద్వేగాన్ని మాత్రమే కాక జ్ఞానాన్ని కూడా ఉత్పత్తి చేయగలవు.
భారతీయ విద్య చాలాకాలంగా తప్పించుకుంటూ వచ్చిన ఒక ప్రశ్నను కూడా ఆయన మన ముందుకు తెస్తారు: తన లోతైన జ్ఞాపకాలు, తన ఉన్నతవర్గం ఇక శ్రద్ధగా చదవని భాషల్లో నిక్షిప్తమై ఉన్న ఒక దేశంలో విద్యావంతుడవడం అంటే ఏమిటి?
దీనికి సమాధానం ఆంగ్లాన్ని మొత్తంగా (ముతకగా) తిరస్కరించడం కాజాలదు. అది మూర్ఖత్వం, చారిత్రకంగా నిజాయితీ లేనిది అవుతుంది. ఆంగ్లం ప్రపంచాలను తెరిచింది, సంఘీభావాలను సృష్టించింది, చలనశీలతను సాధ్యం చేసింది, ఎందరో భారతీయులు ప్రాంతాలను సరిహద్దులను దాటి మాట్లాడగలిగేలా చేసింది. సత్యనారాయణ విమర్శను భాషాపరమైన ద్వేషంగా కుదించితే అది నిరుపయోగం. అసలు ప్రశ్న ఆంగ్లాన్ని నేర్చుకోవాలా అన్నది కాదు, నేర్చుకోవాలి. ప్రశ్న ఏమంటే: ఆంగ్లం సమస్త మేధకు కొలమానంగా మారాల్సిందేనా? భారతీయ భాషలు కేవలం అనుబంధపు భాషలుగా కాక, ఆలోచనా భాషలుగా నిలవడానికి అనుమతి ఉందా?
సత్యనారాయణను చదవడం అంటే అటువంటి ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుందో చూడటం. అది మెత్తనిది కాదు. అది అలంకారప్రాయమైనది కాదు. అది సాంస్కృతిక ప్రచారపు ఆత్మవిశ్వాసం కాదు. ఒక సంప్రదాయం లోపల నిలబడి, దానికి క్షమాపణ చెప్పకుండా అదే సమయంలో దానిని కేవలం పునరావృతం చేయకుండా దానిలో సృజన చేయగల వ్యక్తి ఆత్మవిశ్వాసం అది. సంప్రదాయం ఒక గిడ్డంగి కాదని ఆయన రచన మనకు చెబుతుంది. అది రూపం, స్మృతి, వాదన, పునరుజ్జీవనాల ఒక సజీవ క్రమశిక్షణ. కవి దాన్ని నిష్క్రియంగా వారసత్వంగా పొందడు; ఆ సంప్రదాయం ముందు అతను తనను తాను నిరూపించుకోవాలి.
బహుశా అందుకే ఆయన ఇప్పటికీ అంత గొప్పగా కనిపిస్తారు. ఆయన ఏ సులభమైన శిబిరానికీ చెందడు. ఆధునికవాదులు ఆయనను ఓడించలేకపోయారు. సంప్రదాయవాదులు ఆయనను పూర్తిగా తమలో ఇమడ్చుకోలేకపోయారు. అభ్యుదయవాదులు ఆయనను విస్మరించలేకపోయారు. తెలుగును భావోద్వేగంతో ప్రేమించేవారు ఆయన కఠినత్వాన్ని సులభంగా జీర్ణించుకోలేకపోయారు. ఆయన తెలుగును ఓదార్పుగా అందించలేదు; దానిని ఒక బాధ్యతగా అందించారు.
అదే బహుశా ఆయన చివరి పాఠం కావచ్చు. ఒక భాష కేవలం ఆప్యాయతతో రక్షింపబడదు. అది వినియోగంతో, సాహసంతో, కష్టంతో, విమర్శతో, పాండిత్యంతో, ప్రయోగంతో, అభద్రత లేని గర్వంతో రక్షింపబడుతుంది. పిల్లలకు తమ మాతృభాష ఆంగ్లం కంటే మేధాపరంగా చిన్నదన్న భావన కలిగించనప్పుడు అది రక్షింపబడుతుంది. కవులు తత్వవేత్తలతో వాదించగలిగినప్పుడు, నవలాకారులు ఇతిహాసాలను తిరిగి సృష్టించగలిగినప్పుడు, విమర్శకులు తమ సొంత భావనల నుండి ఆలోచించగలిగినప్పుడు, ఉపాధ్యాయులు శిలాజాలుగా కుదించబడనప్పుడు, పాత గ్రంథాలను గుడ్డిగా పూజించకుండా చౌకగా విసర్జించకుండా ఉన్నప్పుడు అది రక్షింపబడుతుంది.
వేంకట శాస్త్రి పద్యం మనకు గాయాన్ని ఇస్తుంది. సత్యనారాయణ మనకు సమాధానాన్ని ఇస్తారు. ఆంగ్ల పాఠశాలల్లో వారు తెలుగును తేలికగా తీసుకున్నారు. ఆయన దానిని మళ్ళీ బరువుగా చేశారు. భారంతో కాదు గాంభీర్యంతో. స్మృతితో. రూపంతో. ఒక వాదనతో. సంగీతంతో. మరో భాష పాఠ్యపుస్తకంలో ఒక అధఃసూచికగా మారడానికి నిరాకరించే ఒక నాగరికత శక్తితో.